[1] అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు.
[2] కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
[4] ఇలా చెదిరిపోయిన వాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.
[5] ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు.
[6] ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టిన వాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళనుండి దయ్యాలు పెద్దకేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు.
[8] ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు.
[9] సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలం నుండి ఇంద్రజాలం చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్ప వాణ్ణని చెప్పుకొనేవాడు.
[10] చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే ఆ దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు.
[11] అతడు వాళ్ళను తన ఇంద్రజాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు.
[12] కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు.
[13] సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహాత్యాల్ని అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.
[14] యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు.
[15] పేతురు, యోహానులు వచ్చి అక్కడి వాళ్ళకు పవిత్రాత్మ లభించాలని ప్రార్థించారు.
[16] ఎందుకంటే అక్కడి వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు.
[17] వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
[18] అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో,
[19] “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
[20] పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ!
[21] దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు.
[22] నీ దుర్భుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
[23] నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అధర్మానికి లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
[24] ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
[25] పేతురు, యోహానులు తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
[26] ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.
[27] అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి,
[28] తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా.
[29] దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు” అని అన్నాడు.
[30] ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.
[31] “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు.
[32] ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతువున్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు తన బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడ లేదు!
[33] ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”
[34] ఆకోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పండి!” అని అడిగాడు.
[35] ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.
[36] ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, మీరు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగాడు.
[37] దాన్ని ఆపమని ఆజ్ఞాపించి, ఫిలిప్పు ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు.
[38] ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు.
[39] వాళ్ళు నీళ్ళ నుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు.
[40] ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.