Skip to content
Opens in a new window

[1] యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు:

[2] యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు!

[3] సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు!

[4] యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!

[5] మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదరగొట్టాయి!

[6] సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను!

[7] నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది.

[8] భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన!

[9] ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి.

[10] ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు!

[11] యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు!

[12] యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు.

[13] ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది!

[14] యెహోవా ఆకాశంలో గర్జించాడు ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు!

[15] యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు.

[16] అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి!

[17] యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు;

[18] నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు!

[19] నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు!

[20] నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు;

[21] యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి!

[22] అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను!

[23] యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను.

[24] దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను!

[25] అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను.

[26] నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు!

[27] ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు! కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు!

[28] ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు!

[29] యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు.

[30] మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!

[31] దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.

[32] యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు.

[33] దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు!

[34] జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు.

[35] దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు.

[36] డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది!

[37] నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు.

[38] నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను;

[39] నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను!

[40] ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. నీవే నా శత్రువులను ఓడించినావు.

[41] నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను!

[42] నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి!

[43] నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను.

[44] నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు! నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు; నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు!

[45] ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు.

[46] అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు!

[47] యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! అయన నన్ను కాపాడే కొండ;

[48] నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన;

[49] నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు! నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు.

[50] యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను!

[51] ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు; ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు, అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు!

2 సమూయేలు — Chapters