Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:14

[1] సోదరులారా! మేము మీ దగ్గరకు రావటంవల్ల లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు.

[2] మేము యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలిప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు బోధించటానికి ధైర్యం చేసాము.

[3] మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు.

[4] దేవుడు మా యోగ్యతను గమనించి మాకు సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మానవుల్ని కాదు.

[5] మేము పొగడ్తలు ఉపయోగించలేదని మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు వేయలేదు. దీనికి దేవుడే సాక్షి.

[6] మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు.

[7] క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసుకొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో ఉండినాము.

[8] మేము మిమ్మల్ని మనసారా ప్రేమించాము. తద్వారా మీరు మాకు సన్నిహితులయ్యారు. దానితో సువార్తే కాకుండా, మా జీవితాలను కూడా మీతో పంచుకొన్నాము.

[9] సోదరులారా! మా శ్రమ, కష్టము మీకు తప్పక జ్ఞాపకం ఉండి ఉండవచ్చును. మేము దేవుని సువార్తను మీకు ప్రకటించినప్పుడు మేము మీకు భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు పని చేసాము.

[10] విశ్వాసులైన మీ మధ్య మేము ఎంతో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. దీనికి మీరే సాక్షులు. దేవుడు కూడా దీనికి సాక్షి.

[11] మేము మీ అందరితో, తండ్రి తన పిల్లలతో ఏ ధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాము.

[12] మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తూ, మిమ్మల్ని ఓదారుస్తూ, తన రాజ్యంలోకి ఆహ్వానించి, తన మహిమలో మీకు భాగం యిచ్చే దేవుని మెప్పు పొందేటట్లు మిమ్మల్ని జీవించుమని చెప్పాము.

[13] దైవసందేశాన్ని మీరు మా నుండి విని దాన్ని మానవుల సందేశంలా కాకుండా, దైవసందేశంలా అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవసందేశము. అది భక్తులైన మీలో పని చేస్తోంది.

[14] సోదరులారా! యేసు క్రీస్తులో ఐక్యత పొందిన యూదయలోని దేవుని సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే మీరు మీ ప్రజలవల్ల అనుభవించారు.

[15] ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను చంపారు. మిమ్మల్ని తరిమివేసారు. వాళ్ళు దేవుణ్ణి దుఃఖపెట్టారు. మానవులందరికి శత్రువులై జీవించారు.

[16] రక్షణ కలిగించే సందేశాన్ని యూదులుకాని వాళ్ళకు చెప్పనీయకుండా మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపాలను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది.

[17] సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము.

[18] మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలునైన నేను ఎన్నోసార్లు రావటానికి ప్రయత్నం చేసాను. కాని సైతాను మమ్మల్ని అడ్డగించాడు.

[19] ఎందుకంటే మా ఆశలు మీ మీద పెట్టుకున్నాము. మా ఆనందం మీరే. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గర్వించటానికి కిరీటం మీరే కదా!

[20] మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం.

థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి లేఖ — Chapters