[1] మరోసారి సేనలప్రభువు యెహోవానుంచి నాకు వాక్కు వచ్చింది:
[2] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “సీయోను విషయం నేను అత్యాసక్తి గలవాణ్ణి. దాని విషయం ఆసక్తిపరుణ్ణయి అధికంగా మండిపడుతున్నాను.”
[3] యెహోవా చెప్పేదేమంటే, “నేను సీయోనుకు తిరిగివచ్చి జెరుసలంలో నివాసం చేస్తాను. అప్పుడు జెరుసలంను ‘నమ్మకమైన నగరం’ అంటారు, సేనలప్రభువు యెహోవా పర్వతాన్ని ‘పవిత్ర పర్వతం’ అంటారు.”
[4] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “పండు ముసలితనం ఉన్న స్త్రీపురుషులు మరోసారి జెరుసలం వీధులలో కూర్చుంటారు. వయసు ఎక్కువ కావడంచేత వారంతా చేతికర్ర పట్టుకొని ఉంటారు.
[5] నగర వీధులు ఆటలాడుతున్న బాలబాలికలతో నిండి ఉంటాయి.”
[6] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే “ఆ కాలంలో ఈ ప్రజలో మిగిలినవారికి ఇది అద్భుతం అనిపించినా, నాకు కూడా అద్భుతమనిపిస్తుందా? ఇది యెహోవా వాక్కు.”
[7] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “లోకం యొక్క తూర్పు దిక్కునుంచీ పడమటి దిక్కునుంచీ నేను నా ప్రజను పిలిచి రక్షిస్తాను.
[8] జెరుసలంలో నివాసం చేసేలా వారిని తిరిగి తోడుకొని వస్తాను. వారు నా ప్రజగా ఉంటారు. నేను వారికి దేవుడుగా ఉంటాను, వారిపట్ల నీతినిజాయితీతో వ్యవహరిస్తాను.”
[9] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “ఈ రోజులలో ప్రవక్తల నోటనుంచి వెలువడ్డ మాటలను వినేవారలారా, ధైర్యం తెచ్చుకోండి. సేనలప్రభువు యెహోవా ఆలయాన్ని కట్టడానికి దాని పునాది వేసిన రోజున వారు మాట్లాడారు.
[10] అంతకు ముందు రోజులలో మనుషులకు కూలి దొరకలేదు. పశువులకోసం బాడుగ దొరకలేదు. అప్పుడు శత్రు భయంచేత ఎవరూ సురక్షితంగా పనిమీద వెళ్ళలేకపోయారు. ఎందుకంటే, ఒకరిమీద ఒకరికి విరోధ భావం కలిగించాను.
[11] అయితే, గతంలో నేను ఈ ప్రజపట్ల వ్యవహరించినట్టు ఇప్పుడు మిగిలినవారిపట్ల వ్యవహరించను.
[12] “ఇప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. ద్రాక్షచెట్లు ఫలమిస్తాయి, భూమి పైరు ఇస్తుంది. ఆకాశం మంచు కురిపిస్తుంది, ఈ ప్రజలో మిగిలినవారు ఇవన్నీ పొందేలా చేస్తాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
[13] యూదా వారలారా! ఇస్రాయేల్ వారలారా! మీరు ఇతర జనాలలో ఎలా శాపానికి గురి అయ్యారో అలాగే మీరు దీవెనగా ఉండాలని చెప్పి నేను మిమ్ములను విమోచిస్తాను. భయంతో ఉండకండి! ధైర్యంగా ఉండండి!”
[14] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “మీ పూర్వీకులు నాకు కోపం రేపినప్పుడు దయ చూడకుండా నేను మీమీదికి విపత్తు రప్పిస్తానని నిర్ణయించాను.
[15] ఇప్పుడు జెరుసలంకూ యూదాకూ మేలు చేద్దామని నా నిర్ణయం. గనుక భయపడకండి. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
[16] మీరు ఇలా ప్రవర్తించాలి ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, సత్యాన్నీ శాంతిప్రదమైన న్యాయాన్నీ అనుసరించి మీ న్యాయస్థానాలలో తీర్పు తీర్చాలి.
[17] పొరుగువారి మీద ఎన్నడూ దురాలోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు అలా చేయడానికి ఇష్టపడకూడదు కూడా. అలాంటివన్నీ నాకు అసహ్యం. ఇది యెహోవా వాక్కు.”
[18] సేనలప్రభువు యెహోవానుంచి మళ్ళీ నాకు వాక్కు వచ్చింది.
[19] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “నాలుగో నెలలో అయిదో నెలలో ఏడో నెలలో పదో నెలలో ఉపవాస కాలాలు యూదావారికి సంతోషం, ఉల్లాసంతో నిండి ఉన్న మహోత్సవాలవుతాయి. గనుక మీరు సత్యాన్నీ శాంతినీ ప్రియమైనవిగా ఎంచండి.”
[20] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “ఇంకా ప్రజలూ అనేక పట్టణాల నివాసులూ వస్తారు.
[21] ఒక పట్టణంవారు మరో పట్టణంవారి దగ్గరికి వెళ్ళి ‘వెంటనే మనం యెహోవాను ప్రాధేయపడడానికి సేనలప్రభువు యెహోవాను వెదకడానికి వెళ్దాం, పదండి. మేము వెళ్తాం’ అంటారు.
[22] అనేక జనాలూ బలిష్ఠులైన ఇతర ప్రజలూ సేనలప్రభువు యెహోవాను వెదకి ప్రాధేయపడడానికి జెరుసలంకు వస్తారు.”
[23] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “ఆ రోజులలో ఆయా భాషలు మాట్లాడే ఇతర ప్రజలలో పదిమంది ఒకే యూదుడి చెంగు పట్టుకొని ‘దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాం. మేము మీతో కూడా వస్తాం’ అంటారు.”