Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు,

[2] “మీరు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పండి: పురుషుడికి శరీరంలో స్రావం ఏదైనా ఉంటే, దానివల్ల అతడు అశుద్ధంగా ఉంటాడు.

[3] అది కారుతూ ఉన్నా కారకపోయినా అతడి శరీర స్థితి అశుద్ధమే.

[4] స్రావమున్న ఆ వ్యక్తి ఏ పరుపుమీద పడుకొన్నా ఆ పరుపు అశుద్ధమవుతుంది. దేని మీద కూర్చున్నా అది అశుద్ధం.

[5] అంతేకాక, అతడి పరుపును ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. వారు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటారు.

[6] స్రావమున్న ఆ వ్యక్తి దేని మీద కూర్చుంటాడో దానిమీద మరెవరైనా కూర్చుంటే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[7] స్రావమున్న వ్యక్తి శరీరాన్ని ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[8] స్రావమున్న వ్యక్తి శుద్ధంగా ఉన్న ఎవరిమీదైనా ఉమ్మివేస్తే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[9] స్రావమున్నవాడు జీనుమీద కూర్చుంటే అది అశుద్ధం అవుతుంది.

[10] ఆ వ్యక్తి కూర్చుని ఉన్న దేనినైనా తాకేవాడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. వాటిని మోసేవాడు కూడా తన బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు.

[11] స్రావమున్న వ్యక్తి నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[12] స్రావమున్న వ్యక్తి ముట్టుకొన్న మట్టిపాత్రను పగలగొట్టాలి; ప్రతి చెక్కపాత్రను కడగాలి.

[13] “స్రావమున్న వ్యక్తికి స్రావం మానిన తరువాత శుద్ధం కావడానికి ఏడు రోజులు పడుతుంది. అతడు ఏడు రోజులు లెక్కించి తన బట్టలు ఉతుక్కొని, పారుతున్న నీళ్ళతో ఒళ్ళు కడుక్కోవాలి. అప్పుడు శుద్ధంగా ఉంటాడు.

[14] ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను కానీ చేతపట్టుకొని యెహోవా సన్నిధానానికి సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి వచ్చి యాజికి వాటిని ఇవ్వాలి.

[15] వాటిలో ఒకదానిని పాపాలకోసం బలిగా, ఒకదానిని హోమబలిగా యాజి సమర్పించాలి. ఇలా యాజి ఆ వ్యక్తి స్రావం విషయం యెహోవా సముఖంలో ప్రాయశ్చిత్తం చెయ్యాలి.

[16] “ఒక వ్యక్తికి వీర్యస్ఖలనం జరిగితే అతడు స్నానం చెయ్యాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు.

[17] వీర్యం బట్టమీద గానీ, తోలు మీద గానీ పడితే ఆ బట్ట, ఆ తోలు ఉతుక్కోవాలి. ఆ బట్ట లేక ఆ తోలు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటుంది.

[18] పురుషుడు స్త్రీతో సంపర్కం చేసిన తరువాత ఇద్దరూ స్నానం చెయ్యాలి. వారు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటారు.

[19] “స్త్రీకి శరీరంలో రక్తస్రావం కలిగితే ఆమె ఏడు రోజులు కడగా ఉంటుంది. ఆమెను ఎవరైనా తాకితే వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[20] కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పడుకుంటుందో అది అశుద్ధం అవుతుంది; దేని మీద కూర్చుంటుందో అది అశుద్ధం అవుతుంది.

[21] ఆమె పడకను ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[22] ఆమె దేనిమీద కూర్చుంటుందో దాన్ని ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటారు.

[23] ఆమె పరుపును గానీ, ఆమె కూర్చున్న వస్తువును గానీ, అది ఏదైనా సరే, దాన్ని ఎవరైనా తాకితే వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[24] పురుషుడు ఆమెతో శయనిస్తే ఆమె అశుచి అతడికి తగిలిందంటే అతడు ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు. అతడు ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు. అతడు ఏ పడకమీద పడుకుంటాడో ఆ పడక అశుద్ధం అవుతుంది.

[25] “స్త్రీ కడగా చేరే కాలానికి ముందుగా ఆమెకు రక్తస్రావం చాలా రోజులు కలిగినా, కడగా ఉండే కాలం తరువాత అది కలిగినా, ఆమె అశుద్ధంగా ఉంటుంది. ఆమె కడగా ఉండే రోజుల్లో లాగే ఆ రక్తస్రావ కాలంలో అశుద్ధంగా ఉంటుంది.

[26] ఆ రక్తస్రావం జరిగే కాలమంతట్లో ఆమె కడగా ఉన్నట్టే ఏ పడకమీద పడుకొంటుందో అది అశుద్ధం అవుతుంది. ఆమె కడగా ఉండే కాలంలో లాగే దేనిమీద కూర్చుంటుందో అది అశుద్ధం అవుతుంది.

[27] వాటిని తాకేవారెవరైనా అశుద్ధంగా ఉంటారు. వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు.

[28] ఆమెకు రక్తస్రావం మానిన తరువాత ఆమె ఏడురోజులు లెక్కించాలి. ఆ రోజులయ్యాక ఆమె శుద్ధంగా ఉంటుంది.

[29] ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ చేతపట్టుకొని సన్నిధిగుడారం ద్వారానికి యాజి దగ్గరకు వాటిని తేవాలి.

[30] యాజి వాటిలో ఒకదానిని పాపాలకోసం బలిగా, రెండో దానిని హోమబలిగా సమర్పించాలి. ఈ విధంగా యాజి ఆమె అశుద్ధత విషయం ఆమె కోసం యెహోవా సన్నిధానంలో ప్రాయశ్చిత్తం చెయ్యాలి.

[31] “ఇస్రాయేల్ ప్రజల మధ్యలో నా నివాసస్థలం ఉంది. వారు దాన్ని అశుద్ధం చేయకుండా తమ అశుద్ధతవల్ల చావకుండా మీరు వారిని వారి అశుద్ధత నుంచి వేరు చేయాలి.

[32] “స్రావమున్నవాడి విషయం, వీర్యస్ఖలనం వల్ల అశుద్ధంగా ఉన్న వాడి విషయం,

[33] కడగా ఉన్న స్త్రీ విషయం, స్రావమున్న స్త్రీ పురుషుల విషయం, అశుద్ధంగా ఉన్న స్త్రీతో శయనించే వాడి విషయం అనుసరించవలసిన చట్టం ఇదే.”

లేవీయకాండం (యాజి ధర్మవిధులు) — Chapters