Skip to content
Opens in a new window

[1] ఇది పెతూయేల్ కొడుకు యోవేలుకు యెహోవానుంచి వచ్చిన వాక్కు.

[2] పెద్దలారా! ఆలకించండి! దేశ నివాసులారా! మీరంతా వినండి! ఈరోజుల్లో జరిగినది మీ కాలంలో గానీ మీ పూర్వీకుల కాలంలో గానీ ఎప్పుడైనా జరిగిందా?

[3] ఈ సంగతి మీ పిల్లలకు తెలియజేయండి. వారు తమ పిల్లలకు, ఆ పిల్లల తరువాతి తరంవారికి తెలియజేయాలి.

[4] ఎగిరే మిడతల గుంపులు విడిచినదానిని దూకే మిడతలు తినివేశాయి. దూకే మిడతలు విడిచినదానిని మిడత పిల్లలు తినివేశాయి. మిడత పిల్లలు విడిచినదానిని మరో రకం చిన్న మిడతలు తినివేశాయి.

[5] త్రాగుబోతులారా! మేల్కోండి! కన్నీళ్ళు విడవండి! ద్రాక్షమద్యం సేవించేవారలారా! మీరంతా క్రొత్త ద్రాక్షరసాన్ని గురించి పెడబొబ్బలు పెట్టండి! అది మీ నోటికి అందకుండా పోయింది.

[6] లెక్కలేనంత బలమైన సమూహం నా దేశం మీదికి వచ్చింది. వాటి పళ్ళు సింహం పళ్ళ లాంటివి, ఆడ సింహం కోరల్లాంటివి.

[7] అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేశాయి. నా అంజూరు చెట్లను ధ్వంసం చేశాయి. బరెడు ఒలిచి పారవేశాయి. వాటి కొమ్మలు తెల్లబారాయి.

[8] యువదశలో పెళ్ళి నిశ్చయమైనవాణ్ణి కోల్పోయి, గోనెపట్ట కట్టుకొని విలపించే కన్యలాగా విలపించండి.

[9] నైవేద్యాలూ పానార్పణలూ యెహోవా ఆలయానికి రావడం లేదు. యెహోవాకు సేవ చేసే యాజులు శోకిస్తున్నారు.

[10] పొలాలు పాడయ్యాయి. భూమి శోకిస్తున్నట్టుంది. ధాన్యం నాశనమైంది. క్రొత్త ద్రాక్షరసం లేదు. నూనె చెట్లు వాడిపొయ్యాయి.

[11] పొలం పంట నాశనమైంది గనుక కర్షకులారా! గోధుమ, యవల విషయం ఆశాభంగం చెందండి.

[12] ద్రాక్ష చెట్లు వాడిపొయ్యాయి గనుక ద్రాక్షచెట్లు పెంచేవారలారా, ఏడ్వండి. అంజూరు చెట్లు ఎండిపొయ్యాయి. దానిమ్మ చెట్లూ ఈత చెట్లూ ఆలీవ్ చెట్లూ తోటలో చెట్లన్నీ వాడిపొయ్యాయి. మనుషుల సంతోషం కూడా వాడిపోయింది.

[13] యాజులారా! గోనెపట్ట కట్టుకొని శోకించండి. బలిపీఠందగ్గర సేవ చేసే వారలారా! ఏడ్వండి. నా దేవుని సేవకులారా! గోనెపట్ట కట్టుకొని రాత్రి అంతా అలా గడపండి. నైవేద్యాలూ పానార్పణలూ మీ దేవుని ఆలయానికి రాకుండా నిలిచిపోయాయి.

[14] ఉపవాసంకోసం సమయం ప్రత్యేకించండి. పవిత్రసభకు ప్రజలను పిలవండి. పెద్దలను దేశవాసులందరినీ మీ దేవుడైన యెహోవా ఆలయానికి సమకూర్చండి. అక్కడ యెహోవాను బ్రతిమిలాడుకోండి!

[15] యెహోవా దినం ఆసన్నమైంది. అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! అది అమిత శక్తివంతుడైన దేవుని దగ్గరనుంచి నాశనంగా వస్తుంది.

[16] మన కళ్ళెదుటే మన దేవుని ఆలయంలో సంతోషానందాలు లేకుండా పొయ్యాయి. మన ఆహారం నాశనమైంది.

[17] విత్తనాలు మంటి గడ్డలక్రింద కుళ్ళి పొయ్యాయి, పైరు మాడిపోవడంచేత గిడ్డంగులు ఖాళీగా ఉన్నాయి, ధాన్యం కొట్లు నేల మట్టమయ్యాయి.

[18] పశువులు ఎంత మూలుగుతున్నాయి! మేత లేక ఆవుల మందలు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. గొర్రె మందలు సహా నాశనమవుతున్నాయి.

[19] అరణ్యంలో ఉన్న పచ్చిక మైదానాలు అగ్ని చేత కాలిపొయ్యాయి. మంటలు తోటలోని చెట్లన్నిటినీ కాల్చివేశాయి. యెహోవా! నీకు మొరపెట్టుకొంటున్నాను.

[20] నదులు ఎండిపోయినందుకూ అగ్నిచేత పచ్చిక మైదానాలు కాలిపోయినందుకూ అడవి మృగాలు కూడా అత్యాశతో నీవైపు చూస్తూ ఉన్నాయి.

యోవేలు — Chapters