[1] “నేను నిజమైన ద్రాక్షచెట్టును. నా తండ్రి వ్యవసాయదారుడు.
[2] నాలో ఫలించని ప్రతి తీగెనూ ఆయన తుంచివేస్తాడు. ఫలిస్తూ ఉన్న ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించేలా రెమ్మలు కత్తిరించి దిద్దుతాడు.
[3] ఇంతకుముందే నేను మీతో చెప్పిన వాక్కువల్ల మీరిప్పుడు శుద్ధులయ్యారు.
[4] నాలో నిలిచి ఉండండి. నేను మీలో నిలిచి ఉంటాను. తీగె దానంతట అదే ఫలించదు – అది ద్రాక్షచెట్టులో నిలిచి ఉండాలి. అలాగే నాలో నిలిచి ఉండక పోతే మీరు ఫలించలేరు.
[5] “ద్రాక్షచెట్టును నేను, తీగెలు మీరు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వారు సమృద్ధిగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు చేయ గలిగేదేమీ లేదు.
[6] ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతడు తీగెలాగా పారవేయబడి ఎండిపోతాడు. అలాంటి తీగెలను మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. అవి కాలిపోతాయి.
[7] “మీరు నాలో నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుతారు. అది మీకు చేయబడుతుంది.
[8] మీరు సమృద్ధిగా ఫలిస్తూ ఉండడంవల్ల నా తండ్రికి మహిమ చేకూరుతుంది. అలా మీరు నా శిష్యులుగా ఉంటారు.
[9] “తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్ములను ప్రేమించాను. నా ప్రేమలో నిలిచి ఉండండి.
[10] నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే నా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు.
[11] నా ఆనందం మీలో ఉండాలనీ మీ ఆనందం సంపూర్ణంగా ఉండాలనీ ఈ సంగతులు మీతో చెప్పాను.
[12] నా ఆజ్ఞ ఇదే: నేను మిమ్ములను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
[13] తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం ధారపోయడం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు.
[14] నేను మీకిచ్చిన ఆజ్ఞల ప్రకారం చేస్తే మీరు నా మిత్రులు.
[15] ఇకమీదట మిమ్ములను దాసులని పిలవను. ఎందుకంటే, తన యజమాని ఏమి చేస్తున్నాడో దాసునికి తెలియదు. నేను నా తండ్రిచేత వినేదంతా మీకు తెలియజేశాను గనుక మిమ్ములను మిత్రులు అన్నాను.
[16] “మీరు నన్ను ఎన్నుకోలేదు. నేను మిమ్ములను ఎన్నుకొన్నాను, మిమ్ములను నియమించాను. మీరు వెళ్ళి ఫలించాలనీ మీ ఫలం నిలిచి ఉండాలనీ నా పేర మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకివ్వాలనీ నా ఉద్దేశం.
[17] ఇవి మీకు ఆదేశిస్తున్నాను: మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
[18] “లోకం మిమ్ములను ద్వేషిస్తే, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీకు తెలుసు.
[19] ఒకవేళ మీరు లోకానికి చెంది ఉంటే లోకం తన వారిని ప్రేమించి ఉంటుంది. కానీ మీరు లోకానికి చెందినవారు కారు. మిమ్ములను లోకంలోనుంచి ఎన్నుకొన్నాను. లోకం మిమ్ములను ద్వేషించే కారణం ఇదే.
[20] నేను మీతో చెప్పిన ఈ మాట జ్ఞాపకముంచుకోండి – ‘దాసుడు తన యజమానికంటే మించినవాడు కాడు.’ వారు నన్ను హింసించారంటే మిమ్ములను కూడా హింసిస్తారు. వారు నా మాట పాటిస్తే మీ మాట పాటిస్తారు.
[21] అయితే నన్ను పంపినవాణ్ణి వారు ఎరుగరు గనుక నా పేరుకారణంగా అవన్నీ మీపట్ల జరిగిస్తారు.
[22] ఒకవేళ నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. ఇప్పుడైతే వారికి పాపం విషయం సాకు ఏమీ లేదు.
[23] నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు.
[24] మరెవరూ చేయని క్రియలు వారిమధ్య నేను చేసి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. ఇప్పుడైతే వారు నన్నూ నా తండ్రినీ చూచి ద్వేషించారు.
[25] వారి ధర్మశాస్త్రంలో ఇలా వ్రాసి ఉంది: ‘వారు నన్ను నిష్కారణంగా ద్వేషించారు.’ ఈ మాట నెరవేరేలా ఈ విధంగా జరుగుతూ ఉంది.
[26] “నేను ఆదరణకర్తను మీ దగ్గరకు తండ్రినుంచి పంపుతాను. ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెపుతాడు. ఆయన తండ్రినుంచి బయలుదేరే సత్యాత్మ.
[27] మీరు మొదటినుంచి నాతో ఉన్నారు గనుక మీరు కూడా సాక్ష్యం చెపుతారు.