[1] ఎఫెసులో ఉన్న పవిత్రులూ, క్రీస్తు యేసులో ఉన్న నమ్మకస్థులూ అయిన వారికి దేవుని సంకల్పంవల్ల యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు.
[2] మన తండ్రి అయిన దేవుని నుంచీ ప్రభువైన యేసు క్రీస్తునుంచీ మీకు కృప, శాంతి కలుగుతాయి గాక!
[3] మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడూ తండ్రీ అయినవానికి స్తుతులు కలుగుతాయి గాక! పరమ స్థలాలలో ఆయన సమస్త ఆధ్యాత్మిక ఆశీస్సులతో మనలను క్రీస్తులో దీవించాడు.
[4] ఎందుకంటే, మనం ఆయన సన్నిధానంలో పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోకి రాకముందే ఆయన క్రీస్తులో మనలను ఎన్నుకొన్నాడు.
[5] తాను ప్రేమభావంతో యేసు క్రీస్తుద్వారా మనలను కుమారులుగా స్వీకరించడానికి ముందుగానే నిర్ణయించుకొన్నాడు. ఇది ఆయన సంకల్పంలో ఉన్న మంచి ఉద్దేశం ప్రకారమే.
[6] దీనిద్వారా తన దివ్య కృపకు కీర్తి కలగాలని ఆయన భావం. ఆ కృప ద్వారా తాను ప్రేమించినవానిలో మనల్ని స్వీకరించాడు.
[7] ఆయన కృప సమృద్ధి ప్రకారమే ఆయనలో ఆయన రక్తంద్వారా మనకు విముక్తి, అంటే మన పాపాలకు క్షమాపణ, కలిగింది.
[8] ఈ కృప సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనమీద విరివిగా కుమ్మరించాడు.
[9] ఆయన తన సంకల్పంలో ఉన్న రహస్య సత్యాన్ని మనకు వెల్లడి చేశాడు. అదేమంటే
[10] కాలం పరిపక్వమైనప్పుడు పరలోకంలో, భూమిమీద ఉన్న సమస్తమూ ఏకంగా క్రీస్తులోకి తేవాలని తనలో తన మంచి ఉద్దేశం ప్రకారం సంకల్పించాడు.
[11] ఆయనలో మనకు వారసత్వం కూడా లభించింది. దానికి దేవుడు మనలను తన ఉద్దేశం ప్రకారం ముందుగానే నిర్ణయించాడు. ఆయన తన సంకల్పాన్ని అనుసరించిన ఆలోచనను బట్టే సమస్తమూ జరిగిస్తాడు.
[12] మొదట క్రీస్తుమీద నమ్మకం కలిగిన మనం తన మహిమకు కీర్తి అయి ఉండాలని ఆయన ఉద్దేశం.
[13] మీరు కూడా సత్య వాక్కు – మీ రక్షణ శుభవార్త – విన్నప్పుడు ఆయనమీద నమ్మకం ఉంచారు. మీరు నమ్మి ఆయనలో దేవుడు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ముద్ర మీమీద పడింది.
[14] పవిత్రాత్మ మనకు మన వారసత్వం గురించి హామీగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలిగేందుకు తాను సంపాదించుకొన్న దాని విమోచన పూర్తి అయ్యేవరకూ ఈ హామీ ఉంటుంది.
[15] ఈ కారణంచేత, ప్రభువైన యేసుమీద మీ నమ్మకాన్ని గురించీ, పవిత్రులందరిపట్లా మీ ప్రేమభావాన్ని గురించీ విన్నప్పటినుంచి నేను కూడా
[16] నా ప్రార్థనలలో మిమ్ములను జ్ఞాపకం ఉంచుకొంటూ, మీ గురించి కృతజ్ఞతలు చెప్పడం మానలేదు.
[17] మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు – మహిమ స్వరూపి అయి ఆ తండ్రి – ఆయనను తెలుసుకోవడంలో జ్ఞానప్రకాశాలు గల మనసు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
[18] ఆయన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో మీరు తెలుసుకొనేలా మీ మనోనేత్రాలు వెలుగొందాలనీ పవిత్రులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో,
[19] తనను నమ్ముకొన్న మనపట్ల ఆయన బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యమెలాంటిదో మీరు తెలుసుకోవాలనీ నా ప్రార్థన. అది తాను క్రీస్తులో వినియోగించుకొన్న మహా బలప్రభావాల ప్రకారమే.
[20] ఆ బలప్రభావాలచేత ఆయన క్రీస్తును చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపి పరమ స్థలాలలో తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు.
[21] సర్వాధిపత్యం కంటే, అధికారంకంటే, శక్తికంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలో గానీ వచ్చే యుగంలో గానీ పేరుగాంచిన మరి దేనికంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడన్నమాటే.
[22] అన్నిటినీ ఆయన పాదాలక్రింద ఉంచాడు. ఆయనను అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు.
[23] ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.