[1] తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో తెస్సలొనీకవారి సంఘానికి పౌలు, సిల్వానస్, తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ కృప, శాంతి మీకు కలుగుతాయి గాక.
[2] మా ప్రార్థనలలో ఎప్పుడూ మిమ్ములను పేర్కొంటూ మీ అందరికోసమూ దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాం.
[3] విశ్వాసంవల్ల అయిన మీ పని, ప్రేమ పూర్వకమైన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసు క్రీస్తు మీది ఆశాభావంవల్ల అయిన మీ ఓర్పును మన తండ్రి అయిన దేవుని సమక్షంలో ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకొంటున్నాం.
[4] ప్రియ సోదరులారా, దేవుడు మిమ్ములను ఎన్నుకొన్న సంగతి మాకు తెలుసు.
[5] ఎందుకంటే, మా శుభవార్త మీ దగ్గరకు వచ్చినది మాటతో మాత్రమే కాదు, బలప్రభావాలతో, పవిత్రాత్మతో, పూర్తి నిశ్చయతతో. అప్పుడు మీ మధ్య మీ మేలుకోసం ఉన్న మేము ఎలాంటివారమో మీకే తెలుసు.
[6] మీరు చాలా కష్టంలో పవిత్రాత్మ ఇచ్చే ఆనందంతో దేవుని వాక్కు అంగీకరించారు, మమ్ములనూ ప్రభువునూ పోలి ప్రవర్తించడానికి మొదలుపెట్టారు.
[7] ఈ విధంగా మీరు మాసిదోనియ, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు.
[8] ఎలాగంటే, ప్రభు వాక్కు మీ దగ్గరనుంచి మాసిదోనియ, అకయలలో వినిపించింది. ఆ ప్రాంతాలలో మాత్రమే కాక, దేవునిపట్ల మీ నమ్మకం గురించిన మాట అంతటా మారు మ్రోగింది, గనుక మేమేమీ చెప్పనక్కరలేదు.
[9] మీ మధ్యకు మా ప్రవేశం ఎలాంటిదో, మీరు జీవం గల సత్య దేవునికి సేవ చేయడానికీ పరలోకంనుంచి రాబోయే ఆయన కుమారుని కోసం ఎదురు చూడడానికీ ఏవిధంగా విగ్రహాలు విడిచిపెట్టి దేవునివైపు తిరిగారో వారే చెపుతున్నారు.
[10] దేవుడు ఆయనను – దేవుని కోపం నుంచి మనలను తప్పిస్తున్న యేసును – చనిపోయిన వారిలో నుంచి లేపాడు.