[1] విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం: మనకందరికీ తెలివి ఉందని మనకు తెలుసు. తెలివి ఉప్పొంగ జేస్తుంది, ప్రేమ అయితే అభివృద్ధిని కలిగిస్తుంది.
[2] ఎవరైనా తనకు ఏదైనా తెలుసుననుకొంటే తెలుసుకోవలసిన విధంగా ఇంకా తెలుసుకోలేదన్న మాట.
[3] ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయనకు ఆ వ్యక్తి తెలుసు.
[4] అందుచేత విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే విషయంలో మనకు తెలిసినదేమిటంటే, లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు.
[5] “దేవుళ్ళు” లోకంలో, స్వర్గంలో ఉన్నట్టు జనులు చెప్పుకొన్నా (ఇలాంటి “దేవుళ్ళు” “ప్రభువులు” అనేకులున్నారు),
[6] మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనవల్లే సమస్తం కలిగింది. మనం ఆయనకోసమే. ఒకే ప్రభువు ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం కలిగింది. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
[7] అయినా ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతవరకు విగ్రహం గురించి స్మృతి కలిగి తాము తింటున్నది విగ్రహానికి అర్పితమైనట్టు భావించి తింటున్నారు. వారి అంతర్వాణికి చాలినంత వివేచనాశక్తి లేకపోవడంచేత అది అశుద్ధి అవుతుంది.
[8] గాని తిండి మనల్ని దేవునికి సిఫారసు చేయదు. మనం ఏదైనా తింటే ఎక్కువవారమూ కాము. తినకపోతే తక్కువవారము కాము.
[9] అయినా మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూచుకోండి.
[10] సత్యం తెలిసిన మీరు విగ్రహమున్న స్థలంలో తింటే ఎవడైనా ఒకడు చూస్తాడనుకోండి. విశ్వాసంలో బలహీనుడైన అతడి అంతర్వాణికి విగ్రహాలకు అర్పితమైనవాటిని తినే ధైర్యం కలగదా?
[11] క్రీస్తు ఎవరికోసం చనిపోయాడో విశ్వాసంలో ఆ బలహీన సోదరుడు మీ తెలివివల్ల పాడైపోవాలా?
[12] మీరు సోదరులకు వ్యతిరేకంగా పాపం చేసి తక్కువ వివేచనశక్తి ఉన్నవారి అంతర్వాణికి దెబ్బ కొట్టడంవల్ల మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
[13] కాబట్టి, తిండి నా సోదరుడు తప్పటడుగు వేయడానికి కారణమైతే, నా సోదరుడు తప్పటడుగు వేయకూడదని నేను ఇంకెన్నడూ మాంసం తినను.