Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:04

[1] తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.

[2] నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు.

[3] దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట పడి వెళ్ళారు.

[4] ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. “ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?” అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.

[5] బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.

[6] కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు.

[7] ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది.

[8] భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.

[9] మీకు చెవులుంటే వినండి!

[10] చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.

[11] అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు.

[12] వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.

[13] వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు.

[14] తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.

[15] పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.

[16] ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు.

[17] ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం.

[18] ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం — Chapters