[1] ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు.
[2] మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగు గాక.
[3] నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను.
[4] మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే.
[5] సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు.
[6] మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.
[7] మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.
[8] క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.
[9] మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
[10] దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన
[11] అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.
[12] సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను.
[13] ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది.
[14] అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.
[15] కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
[16] ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు.
[17] అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
[18] అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.
[19] మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు.
[20] నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది.
[21] నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే.
[22] అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు.
[23] ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.
[24] అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.
[25] తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది.
[27] నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి.
[28] మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల.
[29] గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.