Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:56

[1] యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం.

[2] ప్రజలారా, మీరంతా వినండి. భూమీ, నువ్వూ నీలో ఉన్నదంతా వినాలి. యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు.

[3] చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు.

[4] ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి. నిప్పుకు కరిగిపోయే మైనంలా, వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.

[5] ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? అది సమరయ కాదా? యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? అది యెరూషలేము కాదా?

[6] నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను. ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను. దాని రాళ్ళు లోయలో పారబోస్తాను, దాని పునాదులు కనబడేలా చేస్తాను.

[7] దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి. దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి. దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను. అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది, కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి.

[8] ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను.

[9] దాని గాయాలు మానవు. అవి యూదాకు తగిలాయి. నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి.

[10] ఈ సంగతి గాతులో చెప్పవద్దు. అక్కడ ఏమాత్రం ఏడవద్దు. బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.

[11] షాఫీరు పురవాసులారా, నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి. జయనాను పురవాసులారా, బయటకు రావద్దు. బేత్ ఎజేల్ దుఖిస్తోంది. వారి భద్రత తొలిగి పోయింది.

[12] మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు. యెహోవా విపత్తు కలిగించాడు. అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది.

[13] లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం.

[14] మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు. అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది.

[15] మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను. ఇశ్రాయేలీయుల నాయకులు అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు.

[16] నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. నీ వెంట్రుకలు కత్తిరించుకో. రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.

మీకా — Chapters