Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:31

[1] యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.

[2] మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది. మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి.

[3] మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు.

[4] మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం. మా కట్టెలు మాకే అమ్మారు.

[5] వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.

[6] అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం.

[7] మా పితరులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.

[8] దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.

[9] ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం.

[10] కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది.

[11] శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు.

[12] అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.

[13] బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.

[14] పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు. యువకులను సంగీతం నుంచి దూరం చేశారు.

[15] మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.

[16] మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!

[17] మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.

[18] సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.

[19] యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.

[20] నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?

[21] యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం.

[22] నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.

విలాపవాక్యాలు — Chapters