[1] దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు.
[2] నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని
[3] రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి.
[4] ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.
[5] మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు.
[6] కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు.
[7] అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు.
[8] అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు.
[9] దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి.
[10] ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి.
[11] సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు.
[12] పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.
[13] చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.
[14] ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు.
[15] చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.
[16] నా ప్రియ సోదరులారా, మోసపోకండి.
[17] ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.
[18] దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనలను కలగజేశాడు.
[19] నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు.
[20] ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు.
[21] కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.
[22] వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.
[23] ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు.
[24] అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు.
[25] కానీ ఎవరైతే స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దాని ప్రకారం చేస్తూ, విని మరిచి పోకుండా ఉంటే వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.
[26] తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం.
[27] తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.