Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:22

[1] మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,

[2] నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.

[3] తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

[4] మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు.

[5] నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

[6] క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.

[7] అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు.

[8] మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక.

[9] మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

[10] ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.

[11] సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.

[12] మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.

[13] నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.

[14] అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.

[15] అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని

[16] ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.

[17] నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.

[18] మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను.

[19] అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.

[20] నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను.

[21] ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.

[22] క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ

[23] “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని,

[24] వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.

గలతీయులకు రాసిన పత్రిక — Chapters