Swara Madhuri Telugu Radio (స్వర మాధురి )
ఇది తెలుగు సంగీత స్వర మాధురి....
సంగీతం...మనస్సులోని కల్లోలానికి విరుగుడు. సంగీతం...బాధలను మరిపించే మందు. సంగీతం... జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామం. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం దివ్యౌషధం. నేడు వరల్డ్ మ్యూజిక్ డే. ఈ సందర్భంగా సంగీతం మనిషికి ఎలాంటి సాంత్వన కలిగిస్తుంది. భారతీయ సంగీతానికున్న గొప్పతనం ఏంటి? భాగ్యనగర సంగీత ప్రముఖుల అభిప్రాయాలతో అంతర్జాతీయ సంగీతదినోత్సవ కథనం.
ఈ ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించలేని వారు ఎవరన్నా ఉన్నారంటే వారు తోక, కొమ్ములు లేని జంతువులతో సమానం అంటారు షేక్‌స్పియర్. మనిషి మాటతోపాటూ పాటనూ నేర్చుకున్నాడు. ఆ పాట కాలంతో పాటూ రకరకాలుగా రూపాంతరం చెందింది. సంగీతంలో రకరకాల ప్రక్రియలు పురుడుపోసుకున్నాయి. ఏ దేశ సంగీతానికైనా ’’స రి గ మ ప ద ని‘‘ ఈ సప్త స్వరాలే మూలం. ఇవే ఆధారం. వినసొంపైన ప్రతి సంగీతం ఆమోదయోగ్యమే. మనిషి జీవితంలో ఓ అంతర్భాగం సంగీతం. పండితులు, పామరులు ఎవరికి తోచిన విధంగా వారు సంగీతాన్ని తమదైన శైలిలో మలుచుకున్నారు.
ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ 12వ శతాబ్దంలో జయదేవుడు అష్టపదుల ద్వారా సంగీతాన్ని పునరుజ్జీవింపచేశారంటారు. ఆ తర్వాత అన్నమయ్య, నారాయణ తీర్థులు, క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు వీరంతా వారి కాలాల్లో భారతీయ సంగీత స్థాయిని పెంచారు. వారి కాలాల్లోనే భారతీయ సంగీతం కొత్త పుంతలు తొక్కింది. 14వ శతాబ్ధంలో పర్షియన్ల రాకతో భారతీయ సంగీతంలో పర్షియన్‌ల సంగీతం మిళితమైంది. హిందుస్థానీ పుట్టింది. కర్ణాటిక సంగీతం, హిందుస్థానీ వంటి శాస్త్రీయ సంగీతంతో పాటు, గజల్స్, ఖవ్వాలీ, లైట్ మ్యూజిక్(లలిత సంగీతం), జానపదం వంటి రకరకాల విభిన్న సరళులతో భారతీయ సంగీతం అలరారుతోంది. గతంతో పోల్చుకుంటే నేడు మన నగరంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వారి సంఖ్య పెరిగిందంటున్నారు సంగీత కళాకారులు. గతంలో కేవలం సంగీతాన్ని వృత్తిగా తీసుకొని బతకడం కష్టంగా ఉండేది. టెలివిజన్ రియాల్డీషోలు, పాటల పోటీ కార్యక్రమాలతోపాటు సినీ నేపథ్యగానం, వాటితో పాటు కచేరీలు వంటి అవకాశాలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో పాప్, రాక్‌బ్యాండ్, బ్రాస్‌బ్యాండ్, ఫ్యూజిన్, ఇండిపాప్ వంటివి బాగా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో సైతం పాటలను శాస్త్రీయ సంగీత స్వరాల నేపథ్యంలో వచ్చేవి. వాటిల్లో ఎక్కువగా మెలోడీ పాటలను ప్రజలు ఆదరించేవారు. ఆయితే నేడు మాత్రం ఎక్కువగా ఫాస్ట్‌బీట్ పాటలనే యువత ఇష్టపడుతోంది. అందుకే సినిమాల్లో సైతం ఫాస్ట్‌బీట్‌లే ఎక్కువగా వస్తున్నాయి. శాస్త్రీయ సంగీతం, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుందని హెల్సింకీ యూనివర్సిటీ వారి పరిశోధనలలో సైతం తేలింది. ఆటిజం చిన్నారులకు, కేన్సర్ చికిత్స పొందుతున్న వారికి మ్యూజిక్ థెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుందని బ్రిటీష్ జనరల్ ఆఫ్ మెడిసిన్ సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి.